టైటిల్ : 28°C
నటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులు
నిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్
నిర్మాతలు: సాయి అభిషేక్
ఎడిటింగ్: గ్యారీ BH
దర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు
విడుదల: ఏప్రిల్ 04, 2025
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.
కథేంటంటే..?
కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ?
ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).
ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.
ఎవరెలా చేసారంటే..?
నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
Cinemirchi Rating 3/5