కిరణ్ అబ్బవరం మీద ఒకప్పుడు దారుణంగా ట్రోలింగ్ జరిగేది. కానీ క చిత్రం తరువాత కిరణ్ అబ్బవరం మీద అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. కంటెంట్ చిత్రాలను కిరణ్ అబ్బవరం ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తాడని అంతా నమ్మేస్తున్నారు. ఇలాంటి తరుణంలో దిల్ రూబా అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ చిత్రం ‘క’ కంటే ముందే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాస్త రిపేర్లు చేసి మార్చి 14న ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దు (కిరణ్ అబ్బవరం) అందరూ సాధారణంగా వాడే పదాలైన సారీ, థాంక్స్ అనే వాటికి ఎక్కువగా విలువ ఇస్తాడు. వాటిని ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా వాడేయడు. అసలు సారీ, థాంక్స్ అనేవి వాడని సిద్దు జీవితంలో మ్యాగీ (కథి దేవిసన్) ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎలా మారింది? ఆ తరువాత సిద్దు జీవితంలోకి అంజలి (రుక్సర్ థిల్లాన్) ఎలా వస్తుంది? అంజలి, సిద్దు ప్రేమ కథలో విలన్ విక్కీ ద్వారా వచ్చే సమస్యలు ఏంటి? సిద్దు లైఫ్‌లోకి జోకర్ (జాన్ విజయ్) ఎంట్రీతో ఎలాంటి సమస్యలు వస్తాయి? అంజలి, సిద్దు ఎందుకు విడిపోతారు? చివరకు అంజలి, సిద్దు ఒక్కటి అవుతారా? లేదా?.. అసలు సారీ, థాంక్స్ అనే పదాల్ని సిద్దు ఎందుకు చెప్పడు? అన్నదే కథ.

దిల్ రూబా సినిమాకు సరైన కథ లేదనిపిస్తుంది. పాయింట్ వరకు బాగానే ఉన్నా దాన్ని తెరపై ఆసక్తికరంగా, అందరినీ ఆకట్టుకునేలా, ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. అసలు ప్రేమ కథను రెండున్నర గంటలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బలమైన సంఘర్షణ గానీ, హీరో హీరోయిన్ల కారెక్టరైజేషన్ గానీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇందులో అలాంటి కథ గానీ, సంఘర్షణ గానీ, కారెక్టరైజేషన్ గానీ ఎక్కడా కనిపించదు.

అర్జున్ రెడ్డి కూడా ఓ ప్రేమ కథే. కానీ అక్కడ అర్జున్ రెడ్డి పాత్రకు జనాలు కనెక్ట్ అయ్యారు. అందుకే కేవలం లవ్ స్టోరీ అయినా కూడా జనాలు ఆదరించారు. ప్రతీ సినిమాలో ప్రేమ కథ ఉంటుంది.. ప్రేమ కథే మెయిన్ పాయింట్‌గా తీసుకుని సినిమా చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లవ్ స్టోరీ అనగానే.. చిన్నగా ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అవ్వడం, ప్రేమ మొదలవ్వడం.. ఆ తరువాత కొంత ప్రయాణం సాగించడం, మధ్యలో గొడవలు జరగడం.. బ్రేకప్ చెప్పడం.. చివరకు ప్యాచ్ అప్ అవ్వడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే ఓ ప్రేమ కథ. ఈ పాయింట్ల మీదే సినిమాను నడిపించాల్సి ఉంటుంది.

ప్రేమ కథలు తెరపై ఇప్పటికి ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రేమ కథను ఎంత కొత్తగా, ఫ్రెష్‌గా, ఆకట్టుకునేలా చెప్పామన్న దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. దిల్ రూబా విషయంలో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ఎక్స్ అనే ఓ టాపిక్‌ను పట్టుకుని ఈ పాయింట్‌ను రాసుకున్నాడు. కానీ అక్కడ అసలు ఎక్స్ అనే ఎమోషన్ కూడా పని చేయదు. అంతగా కనెక్ట్ కాదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఆర్టిఫీషియల్‌గా ఉంటుంది. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేది. కానీ ఎప్పుడో మా అన్నయ్య సినిమా కాలంలో పాతబడిన ఆ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్‌ను వాడటంతో మరింత నీరసంగా అనిపిస్తుంది.

ఇలా ఈ సినిమాలోని సీన్ల గురించి చెప్పుకుంటూ పోతే.. ఏ ఒక్క సీన్ కూడా బతికి బట్ట కట్టదు. ఎక్కడా ఒక్క చోట కూడా సరైన ఎమోషన్ పండినట్టుగా అనిపించదు. ఇలా ఈ చిత్రంలో ఎన్ని నెగెటివ్ పాయింట్లు అయినా చెప్పుకోవచ్చు. కానీ పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో రుక్సర్ థిల్లాన్ కారెక్టరైజేషన్ కొంత వరకు బాగుంటుంది. తండ్రికూతుళ్ల సెంటిమెంట్ ఓ సీన్‌లో మెప్పిస్తుంది. కష్టాలు రాకుండా చూసుకుంటావా? అని అంటే.. ప్రతీ మనిషికి కష్టాలు వస్తాయి.. కానీ ఆ కష్టాల్లో మాత్రం ఎప్పుడూ తోడుంటాను అని హీరో చెప్పే ఆ సీన్ కాస్త బాగుంటుంది.

ఫస్ట్ హాఫ్‌లో అంతో ఇంతో కష్టపడి కథను ముందుకు నడిపించాడు. లవ్ స్టోరీ, నాలుగు జోకులు, రెండు ఫైట్లు, రెండు సాంగ్స్ అంటూ ఏదో అక్కడక్కడే తిప్పేశాడు. కానీ సెకండాఫ్ మాత్రం పూర్తిగా గాడితప్పినట్టు అవుతుంది. అసలు చెప్పడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఇక కథ లేనట్టుగా అనిపిస్తుంది. కాలేజ్ లెక్చరర్‌గా ఎక్స్ రావడం అనేది ఈ మధ్య డ్రాగన్ మూవీలో అందరం చూశాం. ఇందులోనే అదే జరుగుతుంది.క్లైమాక్స్ కూడా అంత ఎమోషనల్‌గా ఏమీ ఉండదు. ఈ సినిమాలో చాలా చోట్ల అనవసరమైన హెవీ యాక్షన్ సీక్వెన్సులు, మోత మోగించే ఆర్ఆర్‌ను పెట్టారు. అక్కడ అంత అవసరం లేదనిపిస్తుంది. కానీ కిరణ్ అబ్బవరం మాస్ ఇమేజ్ కోసం అలా భారీ ఫైట్లు, భారీ ఆర్ఆర్‌ను వాడినట్టుగా కనిపిస్తుంది. ఇక కిరణ్ అబ్బవరం సైతం ఈ మాస్ ఇమేజ్, బిల్డప్ షాట్స్, యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్స్ అని కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. చాలా చోట్ల బేస్‌తో చెప్పాల్సిన డైలాగ్స్‌ కూడా తేలిపోయినట్టుగా అనిపిస్తుంది.కిరణ్ అబ్బవరం లుక్స్ ఈ చిత్రంలో బాగుంటాయి. నటన కూడా బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల కాస్త ఎక్కువ అయినట్టుగా కనిపిస్తుంది. రుక్సర్ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. మ్యాగీ పాత్రలో కథి ఓకే అనిపిస్తుంది. నరేన్ పోషించిన తండ్రి పాత్ర బాగుంటుంది. హీరో అమ్మ పాత్ర ఉందంటే.. ఉందంతే. ఉన్నంతలో కమెడియన్ సత్య నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ సత్యను అంతగా వాడుకోలేదనిపిస్తుంది. విలన్‌గా కనిపించిన విక్కీ, జోకర్ పాత్రలు అంతగా మెప్పించవు. హీరో తండ్రి పాత్ర, గెటప్ శ్రీను కారెక్టర్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.టెక్నికల్‌గా చూసుకుంటే దిల్ రూబా మెప్పించే ఛాన్స్ ఉంటుంది. విజువల్స్ అందంగా ఉంటాయి. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఫైట్స్ కూడా చాలా స్టైలీష్‌గానే ఉంటాయి. ఖర్చు బాగానే పెట్టారని అర్థం అవుతుంది. కొన్ని డైలాగ్స్ గుండెల్ని తాకేలా ఉంటాయి. అన్నీ ఉన్నాయి.. కానీ దానికి తగ్గ బలమైన కథ, ఎమోషన్స్ మిస్ అయ్యాయనిపిస్తుంది. అక్కడే దిల్ రూబా.. దిల్ లేని రూబాగా మారిపోయిందనిపిస్తుంది. మరి ఈ చిత్రం కమర్షియల్‌గా ఏ రేంజ్ వరకు వెళ్తుందో చూడాలి.

చివరగా : ఈ సినిమా ఈ వారం చూసి తీరాలిసిందే

Dil Ruba Movie Rating 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *