టైటిల్ : ఫలక్‌నుమా దాస్
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : విశ్వక్‌ సేన్‌, సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, తరుణ్ భాస్కర్‌
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : విశ్వక్‌ సేన్‌
నిర్మాత : కరాటే రాజు

కథ :
ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్‌ సేన్‌) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. దాస్‌ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్‌ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్‌ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు.

శంకర్ హత్యతో  గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్‌కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి ఒక బిజినెస్ చేద్దామని ఫలక్‌నుమా ఏరియాలో మటన్ షాప్ ప్రారంభిస్తారు. అప్పటికే మటన్ బిజినెస్ లో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ బిజినెస్‌ స్టార్‌ చేశాక వారి బిజినెస్‌ స్లో అవుతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని  రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తుంది. చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ.

నటీనటులు :
తెలంగాణ యాసతో పక్కా హైదరాబాది కుర్రాడిలా దాస్ పాత్రలో విశ్వక్ సేన్ పర్వాలేదనిపించాడు. ఆ పాత్రకు తగ్గట్టు భాషను యాసను బాడీ లాంగ్వేజ్ ను మెయింటైన్ చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం తేలిపోయాడు. భావోద్వేగాలను సరిగా పండించలేకపోయాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఏ ఒక్కరూ మెప్పించలేకపోయారు. లుక్స్ పరంగా నటన పరంగా ప్రేక్షకులను అలరించలేక పోయారు.

దర్శకుడి నుంచి నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ మంచి పాత్రలో కనిపించాడు. ఓ దర్శకుడు నటుడిగా మారితే ఎంతగా మెప్పించగలరో చూపించాడు. సైదులు పాత్రలో తరుణ్ జీవించాడనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండు పాత్ర గురించి, ఉత్తేజ్ ఈ పాత్రను తన అనుభవంతో అవలీలగా చేసేసాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం  ఆ వర్గం ప్రేక్షకుల్ని  కొంతమేరకు ఆకట్టుకోవచ్చు. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే కొన్ని సన్నివేశాల్లో అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరామెన్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్‌ తో పాటు ఇక్కడి బస్తీల పరిస్థితులను అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బాగానే బంధించాడు. ఎడిటర్‌ ఇంకా కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.