నలుగురు స్టార్‌ హీరోయిన్‌లను ఏకకాలంలో ఒకే వేదికపైకి తీసుకురావడం అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఓ కొత్త దర్శకుడు సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథలో నలుగురు హీరోయిన్‌లను ఒప్పించి యాక్టింగ్‌ చేయించాడంటే అతనిలో ఏదో విషయం ఉందనే చెప్పాలి. కాజల్‌, నిత్యామీనన్‌, రెజీనా, ఈషా కీలక పాత్రధారులుగా హీరో నాని నిర్మించిన ‘అ’ సినిమాతో నూతన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇలాంటి ప్రయత్నం చేశారు. ‘అ!’ చక్కని విజయంతోపాటు విమర్శకుల ప్రశంలు అందుకున్నారు నూతన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తదుపరి చిత్రంగా రాజశేఖర్‌తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తుంది. ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉందని సినీ ప్రముఖులు ఎందరో చెప్పారు. తాజాగా ప్రశాంత్‌ వర్మ ఓ క్రేజీ అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ధనుష్‌తో ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ‘కల్కి’ రిలీజ్‌ తర్వాత ప్రశాంత్‌ ఈ ప్రాజెక్ట్‌తో బిజీ అవుతారని ఫిల్మ్‌నగర్‌ గుసగుసలు వినిపిస్తున్నాయి.